ఇంట్లో ఉండాలా లేక జాబ్ చేయాలా అనేది మహిళ ఇష్టం

ఇంట్లో ఉండాలా లేక జాబ్ చేయాలా అనేది మహిళ ఇష్టం

ముంబయి: చదువకుందనే కారణంతో భార్యను జాబ్ చేయాలనే హక్కు భర్తకు లేదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఇంట్లో ఉండాలా లేక బయట ఉద్యోగం చేయాలా అనేది మహిళ ఇష్టమని కోర్టు తెలిపింది. విడాకులిచ్చినప్పటికీ  భార్యకు భరణం చెల్లించాలని  భర్తను పుణె కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే ప్రతి నెలా తన మాజీ భార్యకు రూ. 5 వేలు, కూతురుకు రూ.7 వేలు భరణం చెల్లించాలని పుణె ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన రివిజన్‌ పిటిషన్‌ను పరిశీలించిన బాంబే కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.  డిగ్రీ చదివిన తన మాజీ భార్య జాబ్ చేసేలా ఆదేశించాలని, తాను ఇక నుంచి భరణం చెల్లించలేనంటూ భర్త కోర్టును ఆశ్రయించాడు. అయితే డిగ్రీ ఉన్నంత మాత్రాన జాబ్‌ చేయాలని ఆమెను ఆదేశించలేమని కోర్టు పేర్కొంది. 

‘ఓ గృహిణి తాను జాబ్ చేసి కుటుంబానికి ఆర్ధికంగా చేదోడుగా ఉండటాన్ని మన సమాజం ఇంకా పూర్తి స్థాయిలో అంగీకరించలేదు. పని చేయాలా వద్ద అనేది పూర్తిగా ఆమె ఇష్టం. ఆమెను పని చేయాలని బలవంతం చేయకూడదు. డిగ్రీ చేసిందనే కారణంతో ఆమెను ఇంట్లో కూర్చోవద్దని చెప్పకూడదు’ అంటూ జస్టిస్ భారతి డాంగ్రే ఆదేశించారు.
‘ఇవాళ నేను జడ్జిగా ఉన్నా. ఒకవేళ నేను జాబ్ మానేసి ఇంట్లో కూర్చుంటే... ఓ జడ్జి అర్హతలు ఉండి ఇంట్లో ఎలా కూర్చుంటారని అడుగుతారా?’ అని ఆ మహిళ భర్తను ప్రశ్నించారు. అంతకు ముందు భర్త తరఫున వాదించిన న్యాయవాది... భరణం చెల్లించాలంటూ తన క్లయింట్ ను ఫ్యామిలీ కోర్టు అక్రమంగా ఆదేశించిందని, ఆ తీర్పును రద్దు చేయాలని కోరారు. ఆమెకు ఆదాయం పరంగా బాగానే ఉందని, ఈ విషయాన్ని ఫ్యామిలీ కోర్ట్ దృష్టికి రాకుడా దాచిందని ఆరోపించారు.